బీజేపీ నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ అధికార టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే… మొదట దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. స్వామి గౌడ్ విషయంలో కూడా ప్రచారం జరిగింది. కానీ… స్వామి గౌడ్ ఎక్కడా స్పందించలేదు. గుట్టు చప్పుడు కాకుండా… బీజేపీకి అనుమానం రాకుండా… తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు. స్వామిగౌడ్ ఉద్యమ సమయంలో చాలా కష్టపడ్డారని, తెలంగాణ ఉద్యోగుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే దాసోజు శ్రవణ్‌ సెల్ఫ్‌ మేడ్‌ లీడర్‌ అని ప్రశంసించారు. ఇక… విఠల్, జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా బీజేపీని వీడుతున్నారని ప్రచారం జరిగింది. కానీ.. వీరు ఖండించారు.

 

 

ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ.. విభజన సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతోనే బీజేపీలో చేరినట్లు తెలిపారు. కానీ.. తన ఆశయం నెరవేరలేదని, అందుకే బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కేవలం కేసీఆర్ మాత్రమేనని, ఆయన నాయకత్వంలోనే పని చేస్తామన్నారు. ఇక… దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ… అనాలోచిత నిర్ణయం వల్లే టీఆర్ఎస్ వీడానని అన్నారు. తిరిగి సొంత గూటికి రావడం సంతోషకరమని అన్నారు. శలు, ఆకాంక్షలతో బీజేపీలోకి వెళ్లానని, అందులో కొందరు నాయకులు మూస రాజకీయాలు చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. దేశానికి తలమానికంగా కేసీఆర్‌ తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. నవ భారత నిర్మాణం కోసం ఉడుతా భక్తిగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా శ్రవణ్ తెలిపారు. చివరిశ్వాస ఉన్నంత వరకూ కేటీఆర్ కు అండగా ఉంటామని వెల్లడించారు.