తమిళనాడు తెలుగు విద్యార్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. అక్కడి తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలోనే పరీక్షలు రాసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే… ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నదే తమ లక్ష్యమని లింగ్వెస్టిక్ మైనారిటీస్ ఫోరం ఆఫ్ తమిళనాడు చైర్మన్ సీఎంకే రెడ్డి ప్రకటించారు. మరోసారి ఈ విషయం కోర్టు ముందుకు వచ్చినప్పుడు మరింత బలంగా తమ వాదనలు వినిపిస్తామని అన్నారు. అయితే… తాము తమిళ భాషకు మాత్రం వ్యతిరేకం కాదని, తమిళ భాష నేర్చుకోవడానికి సిద్ధంగానే వున్నామన్నారు. అయితే… తమ మాతృభాష తెలుగును కూడా నేర్చుకునే అవకాశాన్ని స్టాలిన్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని తాము ధర్మాసనం ముందు కూడా వినిపించామన్నారు.

కొన్ని రోజుల క్రిందటే చెన్నైలోని టినగర్ ఆస్కా ప్రాంగణంలో ఆలిండియా తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారి కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తమిళనాడులో తమిళుల తర్వాత అత్యధికమైన గౌరవం తెలుగు వారికేనని, గతంలో ఇక్కడి నుంచే ఆంధ్రుల పరిపాలన సాగిందన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగు వారికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఏఐటీఎఫ్ అధ్యక్షులు సీఎంకే రెడ్డి మైనార్టీ భాషల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన న్యాయపోరాటం తప్పక నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు వారంతా మాతృభాషపై పట్టు కలిగి ఒకే మాట మీద నిలబడితే తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తుందని, ఇక్కడున్న 23 తెలుగు సంఘాల వారు రాజకీయం పక్కన పెట్టి భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.
నేపథ్యమేంటంటే…
తమిళనాడు సర్కార్ 2006 లో నిర్బంధ తమిళ విద్య చట్టం తీసుకొచ్చింది. దీంతో తమిళనాడులోని తెలుగు విద్యార్థులతో పాటు అల్ప సంఖ్యాక భాషా వర్గానికి చెందిన విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాము తమ మాతృభాషలోనే చదువుకుంటామని, సర్కార్ తెచ్చిన జీఓతో తాము చదువుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. దీంతో లింఫాట్ చైర్మన్ సీఎంకే రెడ్డితో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. చివరగా సుప్రీం మెట్లు కూడా ఎక్కారు.












