మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసును విచారిస్తారని సీబీఐని సూటిగా ప్రశ్నించింది. ఈ హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలను బయటకు వెల్లడించాలని సూచించింది. దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులు మార్చాలని కోరుతూ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం.. వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది.
స్టేటస్ రిపోర్టులో ఏమాత్రం పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశాలిచ్చింది. కుట్ర గురించి మాత్రం లోతైనా దర్యాప్తు చేసినట్లు ఎక్కడా కనిపించలేదని, ఎంత సేపూ రాజకీయ వైరం అని మాత్రమే రాశారంటూ మండిపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. అయితే రామ్ సింగ్‌ను మాత్రం కొనసాగించాలని తెలిపింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి తేల్చి చెప్పింది. అయితే.. విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని మాత్రం షరతు విధించింది.
తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని కొట్టేసింది. అంతేకాకుండా విచారణ ప్రాంతానికి న్యాయవాదిని కూడా అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది.సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి తేల్చి చెప్పింది.