ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో నళినీ పిటిషన్ కి కవిత కేసును ట్యాగ్ చేసింది సుప్రీం కోర్టు.

 

చట్టప్రకారం మహిళలను వారి ఇంటిదగ్గరే విచారించాల్సి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్‌చేస్తూ కవిత మార్చి 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు 15న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. సీజేఐ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని చెప్పారు. కానీ, ఆరోజు కేసు విచారణకు రాలేదు. మార్చి 27వ తేదీన జస్టిస్‌ అజయ్‌రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది.

 

మ‌హిళ‌ల‌ను ఈడీ ఆఫీసుకు పిలిచి విచార‌ణ జ‌రిపించే విష‌యంలో గ‌తంలో న‌ళిని చిదంబ‌రం వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. నిందితురాలు కాన‌ప్పుడు విచార‌ణ‌కు ఎలా పిలుస్తారని కపిల్‌ సిబ‌ల్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ క‌విత‌కు ఇచ్చిన‌ ఈడీ స‌మ‌న్లను ర‌ద్దు చేయాలని, ఇంటి వ‌ద్దే విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయన కోరారు.