తెలంగాణలో జరిగే ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఎన్నికలు జ్యోతిషం ప్రకారమే వస్తాయని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ అన్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలంటూ టీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడారు. ఇది 2018 ఎన్నికల నాటి పిటిషన్ అని, వివరాలను సమర్పించడానికి మరి కొంత సమయం కావాలని కోరారు. దీనిపై స్పందిస్తూ…. తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018 లో ముందస్తు ఎన్నికలు వచ్చాయని, ఈ కేసు విచాణ జరగాలంటే గ్రహాలన్నీ అనుకూలంగా వుండాలి కావచ్చు అంటూ జస్టిస్ రామ సుబ్రమణియన్ అన్నారు.