మునుగోడు ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఓటు హక్కు సంపాదించుకున్న వారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటర్ ఐడీలను మంజూరు చేశామని వెల్లడించారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు వున్నారని, 80 ఉళ్లు దాటిన ఓటర్లు 2,576 మంది, పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది వున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ లో 35, రూరల్లో 263 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1192 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. మంగళవారం సాయంత్రం తర్వాత బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం ఉన్నట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి సహా ముగ్గురు అధికారులు ఉంటారని తెలిపారు.