శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఘనంగా రాముడి కల్యాణోత్సవం జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశాడు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ వేడుకలు వైభవోపేతంగా సాగాయి. తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. త్రిదండ్రి శ్రీమన్నారణ చిన్నజీయర్ స్వామీజీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
మిథిలా మైదానంలో భక్తజన సందోహం మధ్య అర్చకులు కల్యాణ క్రతువు జరిపించారు. ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామిఅమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
భద్రాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి వసంతపక్షపయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పట్టణపురవీధులని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచల పట్టణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు అధికారులు. ఇదే క్రమంలో ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ వేడుక జరిగే మిధున స్టేడియాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగానే మిధున స్టేడియంలో ఉన్న ఏకశిలా మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించగా, స్టేడియంలో ప్రత్యక్షంగా 17,000 మంది భక్తులు కళ్యాణ క్రమమును వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.