స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలంటూ తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను టీచర్లు ముట్టడించారు. స్పౌజ్ ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మౌనదీక్షకు దిగారు. ఈ మౌన దీక్షకు టీచర్లు వారి వారి పిల్లలను కూడా తీసుకొచ్చారు. నిరసనలో పాల్గొంటున్న ఉపాధ్యాయుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ధర్నాకు వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్నారు. టీచర్లతో ఉన్న చిన్నారులను సైతం పోలీస్ వ్యాన్లు ఎక్కించి స్టేషన్ కు తరలించారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులది ఇదేం పద్ధతి అంటూ మండిపడ్డారు.
గడచిన సంవత్సరంగా స్పౌజ్ బదిలీలను కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ లోనే పెట్టిందని, దీనిన వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు వున్నారని, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరిగాయన్నారు. అది కూడా కేవలం ఎస్జీటీలకు మాత్రమేనని అన్నారు. ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. డీఎస్ఈ ముట్టడి కార్యక్రమానికి చాలా మంది టీచర్లు చిన్నారులతో హాజరయ్యారు. భర్త ఒక జిల్లాలో తాము ఒక జిల్లాలో పనిచేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పిల్లల బాగోగులు సరిగా చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.