ప్రస్తుతం తెలుగుదేశం వెంటిలేటర్ పై వుందని, ఇక… అది తీసేయడం ఒక్కటే మిగిలిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తోంది ఓ అసమర్థుడి జీవ యాత్ర అని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ… స్పీకర్ పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని, ఇప్పటికే ఆయన నిరాశలో వున్నారని విమర్శించారు.
ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకునే అర్హతే చంద్రబాబుకు లేదని, అధికారం అనే మానసిక రోగంతో చంద్రబాబు బాధపడుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. ఈ మధ్య చంద్రబాబు మాటలు వింటుంటే పోటీకి ముందే ఆటలో ఓడిపోయినట్లు అర్థమైందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ… చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తారని, జగన్ అసలు అధికారంలోకి వస్తారని చంద్రబాబు ఊహించలేదన్నారు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా… జగన్, జనం కలిసే వున్నారని, అసహనం గనక తగ్గించుకోకపోతే.. చంద్రబాబుకే నష్టవాటిల్లుతుందని హెచ్చరించారు.












