సౌదీ అరేబియాలో మహిళల పట్ల ఎన్ని ఆంక్షలుంటాయో చెప్పనక్కర్లేదు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే మహా గగనమే. ఒకవేళ వచ్చినా… సవాలక్ష ఆంక్షలుంటాయి. కానీ… సౌదీ అరేబియాలో గత కొంత కాలంగా మహిళల విషయంలో అక్కడి ప్రభుత్వం సంచలన, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఔరా అనిపిస్తోంది. తాజాగా సౌదీ అరేబియా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హై స్పీడ్ రైళ్లను నడిపేందుకు మహిళలకు అవకాశం కల్పించింది. దీని కోసం 31 మంది మహిళలను శిక్షణ కోసం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తే… భారీ స్పందన వచ్చింది.
28 వేల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 145 మంది ఇంటర్వ్యూలకు వచ్చారు. వారి నుంచి కేవలం 31 మందినే వడబోసి, ట్రైనింగ్ ఇచ్చారు. మొదటి దశ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే రెండో దశ వుంటుందని అధికారులు ప్రకటించారు. చివరి దశ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మక్కా, మదీనా నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్లు నడుపుతారని అధికారులు ప్రకటించారు.
మొదట్లో మహిళలను బయటికే అనుమతించేవారు కాదు. ఆ దశ నుంచి మొదట ఉద్యోగాలు చేసేందుకు అనుమతించారు. ఆ తర్వాత కార్లను డ్రైవ్ చేయడానికి అనుమతించారు. కార్లను రిపేర్ చేసే మెకానిక్ గా కూడ అవకాశం ఇచ్చారు. తాజాగా బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు కూడా ఛాన్స్ ఇచ్చారు.