బాలీవుడ్ నటుడు సోనూసూద్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ స్థానికులు చల్మే తండాలో ఆయన విగ్రహం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటజిల్లా దూల్మిట్ట మండలం చెల్మి తండాలో నటుడు సోనుసూద్ పర్యటించారు. గిరిజన సంప్రదాయం మంగళ హారతులతో చెల్మి తండా వాసులు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామైంది. సోనూసూద్‌కు చేర్యాల పెయింటింగ్‌ను బహుకరించారు అభిమానులు.
రెండేళ్ల క్రితం తండాలో తనకు గుడి కట్టారని తెలిసిందని, ఇక్కడకు రావాలని చాలా కోరిక ఉండేదన్నారు. గ్రామస్తులు, ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాలని వచ్చానని చెప్పారు. కరోనా ఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తానన్నారు. చెల్మి తండా వాసులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.













