టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏర్పాటైన సిట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు నలుగురికి నోటీసులు పంపారు. నేడు విచారణకు హాజరవ్వాలంటూ బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోశ్, కేరళ ఎన్డీయే కన్వీనర్ తుషార్, డాక్టర్ జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ కు సిట్ నోటీసులు పంపింది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విచారణ జరగనుంది. విచారణకు గనక హాజరవ్వకపోతే… అరెస్ట్ చేస్తామని ఈ నలుగురికీ సిట్ తేల్చి చెప్పింది.
అయితే… ఈ నలుగురు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. కేసు దర్యాప్తులో ఈ నలుగురి వాంగ్మూలం అత్యంత కీలకమని పోలీసులు భావిస్తున్నారు. వీరిని గనక విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. అయితే… నేడే విచారణ వున్న నేపథ్యంలో ఎవరెవరు విచారణకు హాజరవుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే… బీజేపీ నేత బి.ఎల్. సంతోశ్ ను విచారించుకోవచ్చు గానీ… అరెస్ట్ చేయడానికి వీలు లేదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.