యూఏపీఏ చట్టం కింద మరో 5 సంవత్సరాల పాటు సిమీపై నిషేధాన్ని పొడగిస్తూ 2019 లో ఆదేశాలు జారీచేయడం ముమ్మాటికీ సబబేనని కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేసింది. భారత్ లో ఇస్లామిక్ పాలనను తీసుకురావాలకునే స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) కలలను నెరవేరబోనివ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. భారత్ లాంటి ప్రాంతంలో అలాంటి సంస్థలు పాతుకుపోయే పరిస్థితులు లేకుండా చేస్తామని ప్రకటించింది. సిమీ నిషేధాన్ని సవాల్ చేస్తూ సిమి మాజీ సభ్యుడు ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్విచారించింది.

నిషేధిత సిమీ ఇప్పటికీ రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, వివిధ సంస్థల నుంచి నిధులను కూడా అందుకుంటోందని కేంద్రం ఈ సందర్భంగా పేర్కొంది. సిమీ కార్యకర్తలు ఇప్పటికీ ఇతర దేశాల్లో వున్న సిమీ నేతలతో టచ్ లో వున్నారని కేంద్రం తన పిటిషన్ లో పేర్కొంది. భారత్ లో ఇస్లామిక్ పాలనను నెలకొల్పాలన్న లక్ష్యంతోనే సిమి పనిచేస్తోందని, అందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని కేంద్రం తేల్చి చెప్పింది. సిమీపై నిషేధం వున్నా… ఇప్పటికీ సమావేశాలు, సహచరులను కలుసుకోవడం, ఆయుధాల సరఫరా, మందుగుండు తయారి, కొనుగోలు లాంటి కార్యకలాపాలు చేస్తూనే వున్నారని కేంద్రం అఫిడవిట్ లో తెలిపింది.












