శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్ ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 5 న జ్యూడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు కోర్టు పొడిగించగా… నిన్నటితో అది ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు రౌత్ ను మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు. మరోవైపు రౌత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను 21 న విచారించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. కాగా… కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఛార్జిషీట్ కాపీని రౌత్ కు అందజేశారు.
పత్రాచాల్ డెవలప్ చేయడంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రౌత్ ను ఈడీ ఆగస్టు 1 న అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ అనంతరం ఆగస్ట్ 8 న 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. 22 న ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం కోర్టు రౌత్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది.