సింగపూర్ చైనాటౌన్‌లో వేంచేసియున్న శ్రీ మారియమ్మన్ ఆలయంలో ఇటీవల జరిగిన మహా కుంభాభిషేక క్రతువును పురస్కరించుకొని జరిగిన మండల పూజలు, శత చండీ హోమం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను సింగపూర్‌లోని ఆర్యవైశ్య కుటుంబాలు అత్యంత శ్రద్ధా ప్రపత్తులు, భక్తి పారవశ్యంతో పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నారు. వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల నడుమ గత తొమ్మిది నెలలుగా ప్రతిరోజూ విష్ణు సహస్రనామ పారాయణ, లలితా లక్షార్చన, సామూహిక భజనా కార్యక్రమాలు శ్రీ వాసవి మాత అనుగ్రహంతో మునుపెన్నడూ జరుగని రీతిలో ఆధ్యాత్మిక, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.
సుమారు 16 సంవత్సరాల తరువాత అటువంటి మహా కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా గత నెల ఫిబ్రవరి 12వ తారీఖున మొదలై గత నలభై రోజులుగా మండల పూజా కార్యక్రమాలతో కొనసాగి శత చండీ హోమంతో సుసంపన్నమైంది. ఈ మొత్తం 9 నెలల కార్యక్రమ రూపకర్త అయిన క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మొత్తం కార్యక్రమ సంక్షేమ బాధ్యతలన్నీ క్లబ్ సీనియర్ సభ్యుడైన ముక్కా కిషోర్ కి అప్పగించి వారిచేత ఈ మొత్తం కార్యక్రమాన్ని నడిపించారు.వాసవి క్లబ్లో సీనియర్ సభ్యులైన మురళి కృష్ణ పబ్బతి, రాజశేఖర్ గుప్త, మకేష్ భూపతి, నూతన సభ్యులైన సుమన్ రాయల, ఆనంద్ గందె, వినయ్, కిషోర్ శెట్టి, సరిత, ఫణీష్ వాసవి మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాద భలం లేకపోతే ఇంతటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరిని సమన్వయము చేసుకొంటూ వెళ్లడం అసాధ్యమని ముక్తకంఠంతో చెప్పడం విశేషం.
ఈ బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేందుకు వాసవి క్లబ్ మెర్లయన్ కార్యనిర్వాహక విజయ్ సారధి పాడి, శ్రీకాంత్ నూతిగట్టు, సరితా దేవి, దివ్య గాజులపల్లి, భార్గవి, హేమ కిషోర్, రాజశేఖర్ గుప్త, శ్రీవాణి, చైతన్య పురుషోత్తం, వాసవి ఫణీష్, హేమ కిషోర్ ల తమ విశేష సహకారాన్ని అందించారు.