దివంగత సీఎం జయలలిత మరణంపై నిచ్చెలి శశికళ పాత్రపై విచారణ జరిపించాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీంతో అందరి కళ్లూ చిన్నమ్మపైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. తాను ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయంగా తనను అడ్డుకోలేరని తేల్చి చెప్పింది. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం పతనమే లక్ష్యంగా, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు.
డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు, ఆస్తిపన్ను, వాటర్ ట్యాక్స్ పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శశికళ తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వంపై చాలా విమర్శలు వస్తున్నాయని, వాటిని ఎలా పరిష్కరించాలో తెలియక డీఎంకే ఇతరులను టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు.