ఎప్పుడూ వార్తల్లో ఉండే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, మరో కొత్త వివాదానికి తెరలేపారు.హిందూ అనేది మతపరమైన పదం కాదని, భౌగోళిక పదమని కొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు ఆయన తాను హిందువేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో పుట్టి ఇక్కడే నివసించే వారినందరినీ హిందువులనే పిలవాలన్నారు. భారతదేశంలో పుట్టినా, భారతదేశంలో పుట్టిన గింజలు తిన్నా, ఇక్కడి నదుల నీరు తాగినా, అలాంటి వారిని హిందువుగా పిలువడానికి అర్హులని చెప్పారు. బ్రిటీష్ వారు మతం ఆధారంగా మనల్ని విభజించడం వల్లనే ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలో స్థిరపడిన మలయాళీ హిందువులు తిరువనంతపురంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రారంభించారు. భారతదేశం పేద దేశం కాదని, భారతదేశ సంపదపై అత్యాశతో బయటి వారు ఇక్కడికి వచ్చారని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. వీరి కారణంగానే 1947 నాటికి మనం దక్షిణాసియాలో పేదరికానికి చిహ్నంగా మారామని, అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రస్తుతం భారతీయులు ప్రపంచంలోని అనేక పెద్ద బహుళజాతి కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారని, దీన్ని బట్టే ప్రపంచం భారత్ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నదన్నారు.