సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదని తెలుస్తోంది. డెక్కన్ మాల్ స్టోర్స్ లో పనిచేస్తున్న వసీం, జునైద్, జహీర్ ఏమైపోయారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదని సమాచారం. బీహార్ కు చెందిన ఆ ముగ్గురు ఏడాదిగా స్టోర్స్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు వసీం, జునైద్, జహీర్ లోపలే ఉన్నట్లు చెప్పడంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ముగ్గురు కూలీల కుటుంబసభ్యుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా మొబైల్ సిగ్నల్స్ ఆ ఏరియాలోనే గుర్తించారు. వారు సజీవ దహనమయ్యారా? అన్న కోణంలోనూ అధికారులు ఆలోచించడం ప్రారంభించారు.
ఎంత ప్రయత్నాలు చేసినా… ఆ ముగ్గురి ఆచూకీ ఇంకా దొరక్క పోవడంతో అధికారులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వారి ఆనవాళ్లు గుర్తించేందుకు ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది విక్టిమ్ లొకేషన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాన్ని బిల్డింగ్ లోకి పంపిన అధికారులు.. దీన్ని ఉపయోగించి శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తులను సైతం కనిపెట్టవచ్చని చెప్పారు. వీఎల్సీ సాయంతో బాధితులతో మాట్లాడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రోన్ల సాయంతో భవనం లోపలి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేసినా బిల్డింగ్ లోపల అంతా చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించడం లేదు.