రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 15 వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఏపీ సర్పంచులు డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వాలని ,లేదంటే సర్పంచ్ పదవులకు రాజీనామా చేసేస్తామని, పార్టీలకతీతంగా అందరూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం ముట్టడికి సర్పంచులు పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు రావాల్సిన నిధుల కోసం వచ్చిన పంచాయతీ సర్పంచ్‌లను ఏపీ ప్రభుత్వం కనీసం పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలోకి కూడా రానివ్వకుండా పోలీసులతోఅడ్డుకొని, బలవంతంగా అరెస్ట్‌లుచేసి లారీల్లో తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.8, 000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్ళించిందని సర్పంచులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయాల నుండి ప్రజలకు డబ్బులు వేస్తున్నామని చెబుతున్నారని, కానీ పంచాయతీల్లో రోడ్లను పట్టించుకోవడం లేదని, ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు ఇవ్వబోమని చెబితే అసలు పోటీయే చేసేవాళ్లం కాదని, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు.