భారత దేశం గర్వించదగ్గ సంస్కృత మహా కవి ”శ్రీ శ్రీభాష్యం విజయ సారథి” గారు కన్నుమూశారు. సంస్కృతానికి వారు చేసిన సేవలు, సమాజానికి, హిందూ సంప్రదాయానికి వారు చేసిన సేవలను గుర్తించి, 2020 లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ”పద్మశ్రీ” పురస్కారాన్ని కూడా ప్రకటించింది. ఎక్కడా కీర్తి కాంక్షలు లేకుండా, ప్రచార యావ లేకుండా… కరీంనగరం కేంద్రంగా సనాతన సంప్రదాయం కోసం సైలెంట్ గా పని చేశారు.
కరీనగరము జిల్లాలోని చేగుర్తి గ్రామంలో శ్రీభాష్యం గోపమాంబ, నరసింహాచార్య దంపతులకు 1936 లో శ్రీభాష్యం విజయ సారథిగారు జన్మించారు. చిన్న తనంలోనే తర్కశాస్త్రం నేర్చుకున్నారు. తన 7 వ యేటనే ఎవ్వరికీ చెప్పకుండా.. బాసర వెళ్లి… ఉపాసన చేశారు. తల్లి అనుగ్రహంతో ఆశువుగా కొన్ని పద్యాలు చెప్పారు. దానినే ”శారదా పదకింకిణి” పేరుతో వెలువరించారు. ఇదే వారిది తొలి కావ్యం. తన 8 వ యేటనే తిరుప్పావైని శ్రీవ్రతంగా సంస్కృతంలోకి అనువదించారు. గిరిజన స్త్రీల వేదనా స్థితిని శబరీ పరిదేవనమ్ గా మలిచారు. అలాగే మనోరమ 1000 నవలను అందించిన బాల మేధావి. ఇక.. విద్యాభ్యాసం పాలకుర్తలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ సంస్కృత వేద పాఠశాల, వరంగల్లులోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో, తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో జరిగింది.

వీరు సంస్కృతంలో రాసిన మందాకినీ ఓ మహాకావ్యం. సంస్కృత భాషలో మాత్రా ఛందస్సులో రచించిన తొలి గేయకావ్యం. ఇదంతా గంగావతరణ ఘట్టం. అయినా.. అందులో సమాజం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక.. ప్రవీణ భారతమ్, విషాదలహరీ, భారత భారతీ, క్రాంతి గీతమ్ లాంటి గ్రంథాలు రాశారు.
1975 లో వారణాసి కేంద్రంగా ”శ్రీ కరపాత్రో స్వామి” వారి ఆధ్వర్యంలో ఓ విద్వత్సభ జరిగింది. అందులో శ్రీభాష్యం వారు ప్రసంగించారు. వీరి శక్తి సామర్థ్యాలను గమనించి… వీరిని సనాతన ధర్మం వైపు కరపాత్రో స్వామి వారు మళ్లించారు. దీంతో ఓ వైపు సాహిత్య యజ్ఞం చేస్తూనే… మరో వైపు కరీనగరములో ”సర్వ వైదిక సంస్థానం” అనే పేరుతో ఓ సంస్థానం ఏర్పాటైంది. దైవ భక్తి, దేశభక్తి, సమాజానురక్తి, ధర్మాసక్తిని పెంపొందించేందుకు ఈ వైదిక సంస్థానం ఏర్పాటైంది. అలాగే కరీనగరములో యజ్ఞ వరాహ క్షేత్రం ఏర్పాటు చేశారు. అందులో హయగ్రీవుడి మూర్తిని చూసి తీరాలి. గత 40 సంవత్సరాలుగా సర్వవైదిక సంస్థానం ద్వారా అనేక వైదిక కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రతిష్ఠలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా జరుపుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో వేదోక్త ప్రకారంగా ఆలయ ప్రతిష్ఠలు కూడా చేశారు. కరీనంగర్ కేంద్రంగా యజ్ఞ వరాహ క్షేత్రంలో వీరు చేసే బ్రహ్మోత్సవాలు ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి.
సర్వ వైదిక సంస్థానం ఉప కులపతిగా వీరు ఓ ”ధర్మనిధి” ని ఏర్పాటు చేశారు. యజ్ఞ వరాహ క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో ఈ నిధి నుంచే శాస్త్ర పండితులకు, కవులకు, కళాకారులకు పురస్కారాలను అందిస్తున్నారు. అలాగే సంస్థానం ఉపకులపతిగా శ్రీభాష్యం వారు నిర్వహించిన సాహితీ సభలు దేశ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే వారి పుట్టిన రోజు నాడు… దేశ వ్యాప్తంగా సంస్కృతానికి బాగా సేవ చేస్తున్న ఓ వ్యక్తికి… పురస్కారం అందిస్తారు. శ్రీభాష్యం విజయ సారథి గారంటే నడిచే విద్యాసరస్వం. ఇన్ని సంవత్సరాల పాటు ఆ గీర్వాణి సేవ చేసి… గీర్వాణిలో లీనమయ్యారు. ఓం శాంతి… ఓం శాంతి… ఓం శాంతి…