విజయవాడ వేదికగా ‘సమరసతా సమ్మేళనం’… హాజరైన ప్రముఖులు

విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరింయలో సామాజిక సమరసతా వేదిక ఏపీ శాఖ పక్షాన ఆది ఆంధ్ర సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి. విష్ణు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌, మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు, కమలానంద భారతీ స్వామీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ…

 

ఒక్క దళితులే కాదు… అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే, సమాజంలోని సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. రాజకీయ నేత నుంచి సామాన్యుడి వరకూ ప్రతి ఒక్కరూ ఒక సామాజిక కార్యకర్తగా తయారై, అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ వంతు కృషి సల్పాలని కోరారు.దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అణగారిన వర్గాలను ఏమైనా ఉద్ధరించాయా? లేదా? అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ స్వామి అన్నారు. దళితులు, అంటరానివారు వంటి పేర్లతో సమాజంలో ఉన్న వర్గాలను ఎప్పుడు మనమంతా సహృదయంతో అక్కున చేర్చుకుంటామో అప్పుడే మనమంతా భగవంతుని దృష్టిలో సామాజిక సంపన్నులమన్నారు.

 

సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఏడేళ్ళ కిందట ఆవిర్భావించిన సామాజిక సమరసత వేదిక నిరంతరం కృషి చేస్తోందని ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి. విష్ణు అన్నారు. కృష్ణానదీ తీరాన అనేక సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ ఉద్యమాలు జరిగాయని, 105 ఏళ్ళ కిందటే వివిధ కులాలకు చెందిన పెద్దలు వందల ఏళ్ళుగా అంటరానితనానికి గురైన వర్గాల ఉన్నతి కోసం, సామాజిక సమరసత కోసం 1917, నవంబర్‌ 4,5,6తేదీల్లో విజయవాడలో ‘ఆది ఆంధ్ర మహా సభ’ను నిర్వహించారన్నారు.

హిందూ మతం ఏళ్ళనాటి తప్పులను గుర్తించి, సంస్కరించుకుంటుందని, ఇది శుభపరిణామమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ అన్నారు. భారతీయ గడ్డపై జన్మించిన ఎవరిని దూరం పెట్టడడం దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అందరూ మనవారేనన్న భావన సమాజంలోని చివరి వ్యక్తి వరకు వెళ్ళాలన్నారు. ఇప్పడు సంఘం చేస్తున్నది ఇదేనని అన్నారు. అయితే, సమాజం నుంచి ఇంకా మద్దతు అవసరముందన్నారు.

 

సమాజాన్ని చదవాలి… అధ్యయనం చేయాలి.. కాలికి బలపం కట్టుకుని వీధి, వాడా తిరగాలని అప్పుడే సమాజంలోని స్థితిగతులు అర్థమవుతాయని, అసమానతలను ఏ విధంగా నిర్మూలించాలకో అవగతమవుతుందని గన్నవరంలోని శ్రీ భువనేశ్వరి పీఠం పూజ్య శ్రీ కమలానందభారతి స్వామి అన్నారు. కుల సమస్యలు పోవాలంటే, ముందు మన ఇంట్లో స్థితిని గమనించి, మన ఇంటి నుంచే అటువంటి చర్యలకు పూనుకొవాలని పిలుపునిచ్చారు. హిందువు అంటే.. ముందు దళితుడేనని ఈ సందర్భంగా అన్నారు. అయితే, ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పులు వస్తున్నాయన్నారు.

 

Related Posts

Latest News Updates