సగిలేటి కథ మూవీ రివ్యూ

చిత్రం: సగిలేటి కథ

విడుదల తేదీ: 13-10-2023

నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్,  నరసింహా ప్రసాద్ పంతగాని, రాజశేఖర్, తదితరులు 

సంగీతం: జశ్వంత్ పసుపులేటి

నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ

సినిమాటోగ్రఫీ, దర్శకత్వం:  రాజశేఖర్ సుడ్మూన్

గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథల పట్ల ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. అలాంటి బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన చిత్రాలెన్నో ఘనవిజయం సాధించాయి. ఇక ఇప్పుడు అలాంటి మరో చిత్రమే, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటించిన ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా వస్తున్న ఈ చిత్రాన్ని హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్, సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. రెండు రోజుల ముందే మీడియా కి ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శించారు. ప్రీమియర్ రివ్యూ మీకోసం ప్రత్యేకంగా..

కథ:

రాయలసీమ ప్రాంతంలోని సగిలేరు గ్రామం  ప్రెసిడెంట్ చౌడప్ప (రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ దొరసామి (రమేష్)లు స్నేహితుల్లా ఉంటారు. చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం), దొరసామి కూతురు కృష్ణ కుమారి (విషిక కోట) ప్రేమలో పడతారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మాంకాలమ్మ జాతర్లో దొరసామిని చౌడప్ప నరికేస్తాడు. ఆ తరువాత జరిగిన కథ ఏంటి? వీరి ప్రేమ కథ ఎలా ముందుకు సాగింది? చివరకు వీరిద్దరూ ఏమయ్యారు? అనేది సగిలేటి కథ

నటీనటుల పనితీరు:

కుమార్ పాత్రలో రవి చక్కగా నటించాడు. అవసరమైన చోట అమాయకత్వాన్ని అలాగే ఎమోషన్స్ ను బాగా పలికించాడు. టామ్ బాయ్ క్యారక్టర్ లో కృష్ణ కుమారిగా విషిక అద్భుతంగా నటించింది. అందం, నటనతో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలో చౌడప్ప, ఊరి ప్రెసిడెంట్ తాత, హీరో తల్లి పాత్రలు బాగున్నాయి. అన్ని కారెక్టర్లు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: 

సాంకేతికంగానూ ఈ సినిమా క్వాలిటీ తో తెరకెక్కింది. దర్శకుడే ఛాయాగ్రాహకుడు అవడంతో విజువల్స్ మీద మంచి గ్రిప్ తో తనకి కావాల్సిన నేచురాలిటీ ని రాబట్టుకున్నారు. జస్వంత్ అందించిన సంగీతం కూడా కథకు తగ్గట్టు చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సహజంగా చిత్రాన్ని రూపొందించి నిర్మాతలు మంచి ప్రయత్నం చేశారు.

విశ్లేషణ:

గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కనుక రకరకాల పాత్రల చుట్టూ కథ ను నడపాలి. అలా అన్ని పాత్రలతో ప్రేమకథను కోర్ పాయింట్ గా సగిలేటి కథ ను బాగానే రాసుకున్నాడు దర్శకుడు రాజశేఖర్. ఆ పాత్రలను జనాలకు కనెక్ట్ చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కథ, కథనాలు మరీ కొత్తవి కాకపోయినా ప్రేక్షకులను నవ్వించేలా తెరకెక్కించారు . ఓ రెండు గంటల పాటు కూర్చోబెట్టేస్తారు. చివర్లో వచ్చే ట్విస్టులు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉండి ప్రేక్షకులను శాటిస్ఫై చేస్తాయి.  అప్పటి వరకు చూసిన పాత్రలకు చివర్లో కనిపించే కారెక్టర్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ ట్విస్ట్ బాగా ఎగ్జిక్యూట్  చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. గ్రామీణ వాతావరణాన్ని, 2007 బ్యాక్ డ్రాప్‌ను బాగా చూపించారు. చికెన్ మాత్రం అందరికీ నోరూరేలా చేస్తుంది. నిడివి తక్కువ ఉండటం సినిమాకి కలిసొచ్చే అంశం.

రేటింగ్: 3/5

చివరగా: పల్లెటూరిని గుర్తు చేసే సహజమైన ప్రేమ కథ

Related Posts

Latest News Updates