తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను వెంటనే ఏపీకి పంపాలన్న హైకోర్టు ఆదేశాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇప్పటి వరకు సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి, వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని అన్నారు. ఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు. ఇక.. సీఎస్ సోమేశ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రేవంత్ రెడ్డి స్వాగతించారు. బిహార్ ముఠాకు సోమేశ్ లీడర్ అని, ఆయన అనర్హుడని, వెంటనే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేశ్ కు తాకిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ఐఏఎస్ లకు ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని తాము ముందునుంచీ చెబుతూనే వున్నామని రేవంత్ గుర్తు చేశారు.