హిందూ మతస్తులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అమెరికాలో ఓ రాష్ట్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. హిందూయిజంపై ద్వేషం, మత దురభిమానంతో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అనుసరిస్తున్న వైఖరి, పాల్పడుతున్న చర్యలను నిరసిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. హిందువులకు మద్దతుగా యూఎస్‌లో ఒక రాష్ట్ర శాసనసభ ఇలా తీర్మానం చేయడం ఇదే ప్రథమం. జార్జియాలో భారత అమెరికన్లు అధికంగా నివసించే అట్లాంటా సబర్బ్‌లోని ఫోర్సిత్‌కు చెందిన ప్రజాప్రతినిధులు లారెన్, మెక్‌డోనాల్డ్, టాడ్ జాన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో కోట్ల మంది హిందూ ధర్మాన్ని, సిద్ధాంతాలను ఆచరిస్తున్నారని, శాంతి, సామరస్యం, పరుల పట్ల గౌరవం, నైతిక విలువలు వంటి విశ్వాసాలను ఆచరించే వీరిపై కొందరు ద్వేషంతో ప్రవర్తించడాన్ని జార్జియా అసెంబ్లీ ఖండించింది.కొన్ని దశాబ్దాలుగా హిందువుల పట్ల విద్వేష భావంతో దాడులు జరిగినట్టు గత సంఘటలు వెల్లడిస్తున్నాయని, దీన్ని అందరూ ఖండించాలన్నారు.
వైద్యం, సైన్స్, ఇంజినీరింగ్, ఐటీ, ఆతిథ్యం, ఆర్థికం, అకాడమీ, తయారీ, ఎనర్జీ, రిటైల్ ట్రేడ్‌లతో పాటు పలు రంగాలలో ఇండో అమెరికన్ల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. యోగా, ఆయుర్వేద, మెడిటేషన్, మ్యూజిక్, కళలను అమెరికాకు తీసుకువచ్చి అమెరికన్లను నూతన పంథాలో నడిపించడమే కాక, వాటిని అనుసరించేలా చేసి లక్షల మంది ఆయుష్షు పెంచేందుకు దోహదపడుతున్నారని వెల్లడించారు.