బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాసరలో నిరసనలు కొనసాగుతున్నాయి. బాసర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వ్యాపార సంఘాలు మహా ధర్నాకు పిలుపునిచ్చారు. రేంజర్ల రాజేష్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు అమ్మవారి క్షేత్ర పరిధిలోని దుకాణాలు, ఆటోలు, రెస్టారెంట్లను మూసేశారు. భారీ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో గ్రామస్థులతో పాటు యువకులు, విద్యార్థులుకూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో బైంసా-నిజామాబాద్ మధ్య ట్రాఫిక్ స్తంభించింది. రేంజర్ల రాజేష్ ను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే రాజేశ్ పై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. మరో వైపు ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.