రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.హైదరాబాద్ లో ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో కన్నుమూశారు. సోమ‌వారం హైదరాబాద్ మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాన్ ఇండియా హీరోగా రాణిస్తోన్న ప్రభాస్‌కు కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారు.  1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 187 చిత్రాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టారు. ఇండస్ట్రీలో రెబెల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. కృష్ణంరాజు తుది శ్వాస విడిచారనే వార్త టాలీవుడ్‌కి షాకింగ్‌గా ఉంది.అమరదీపం, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మాన్న, తాండ్ర పాపారాయుడు వంటి చిత్రాల్లో కృష్ణంరాజు నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డు వచ్చింది. అలాగే అమరదీపం, మనవూరి పాండవులు చిత్రాలకు రాష్ట్రపతి అవార్డులు కూడా వచ్చాయి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘రాధే శ్యామ్’. రాజకీయాల్లోనూ తనదైన పాత్రను పోషించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. తర్వాత ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు.

Related Posts

Latest News Updates