చాన్నాళ్లుగా మేం ఎదురు చూస్తున్న సమయమిది..మధుర క్షణాలను మరచిపోలేను.. పాపకు మీ అందరి ఆశీస్సులు ఉండాలి: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. అపోలో డాక్టర్ల పర్యవేక్షణలోనే తల్లీ, బిడ్డ ఉన్నారు. పాప పుట్టిన మూడో రోజున హాస్పిటల్ నుంచి ఉపాసన డిశ్చార్జ్ అయ్యి.. మొయినాబాద్‌లోని తన తల్లి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘‘‘పాప జూన్ 20న తెల్లవారు జామున పుట్టిన సంగతి తెలిసిందే. ఉపాసన, పాప రికవర్ కావటంతో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతున్నాం. డాక్టర్ సుమన, డాక్టర్ రుమ, డాక్టర్ లత, డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ అమితా ఇంద్రసేన, తేజస్విగారు సహా ఎంటైర్ అపోలో టీమ్‌కి థాంక్స్. చాలా బాగా చూశారు. మేమెంతో లక్కీ. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉపాసన, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇంత మంచి డాక్టర్స్ టీమ్ కుదిరారు కాబట్టి ఎలాంటి భయం లేదు. అలాగే మా అభిమానుల ప్రార్థనలు, వాళ్లు చేసిన పూజలు గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్లను ఎప్పటికీ మరచిపోలేను. ఇంతకన్నా వాళ్ల దగ్గర నుంచి నేనేం అడుగుతాను. అలాగే అన్నీ దేశాల నుంచి మా శ్రేయోభిలాషులు, ఇతరులు ఆశీస్సులు అందించారు. సందర్భంగా మీడియా మిత్రులందరికీ థాంక్స్. మీరందరూ అందించిన బ్లెస్సింగ్స్ మా పాపకు ఎప్పుడూ ఉంటాయి. ఇంతకన్నా మధుర క్షణాలను మరచిపోలేను. మీ అభిమానం చూస్తుంటే మాటలు రావటం లేదు. ఈ అభిమానం మా పాపకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
21వ రోజు పాపకు పేరు పెడదామని అనుకుంటున్నాను. నేను, ఉపాసన ఓ పేరు అనుకున్నాం. తప్పకుండా అది అందరికీ తెలియజేస్తాను. చాలా సంవత్సరాలుగా మేం ఎదురు చూస్తున్న మంచి సమయం ఇది. అందరం చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడు ఆశీస్సులు మాకు దొరికాయి. చెప్పలేనంత ఆనందంగా ఉంది. మళ్లీ అందరికీ థాంక్స్’’ అన్నారు.