కృష్ణంరాజు తనకు మంచి మిత్రుడని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా.. ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన కృష్ణంరాజు సంతాప సభకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1998 లో తాను తొలిసారిగా కలుసుకున్నామని, అప్పుడాయన ఎంపీగా ఎన్నికై, ఢిల్లీకి వచ్చారని అన్నారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయన చాలా దగ్గరయ్యాడు అని గుర్తు చేసుకున్నారు.

 

కృష్ణంరాజు ఇక లేరనే ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దాన్ని నేను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను అని తెలిపారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా.. తనను అన్నగారు అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండేవారన్నారు. కృష్ణంరాజు 55 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారని చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని, కృష్ణంరాజు ని ప్రత్యేకంగా అభినందించానని పేర్కొన్నారు.

 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘ కృష్ణంరాజు మృత్యువార్త తెలిసి రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు. ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని, వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కృష్ణంరాజు ఇటీవలే నాకు కాల్ చేసి ప్రధానిని కలవాలి అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు.  కృష్ణంరాజు తన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్ళడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్ళలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు.’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 

మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘ఫిలింనగర్ సొసైటీలో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత విలక్షణ నటుడు కృషంరాజు. అందరూ చనిపోతారు. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు కృష్ణంరాజు.  నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూసాను. మర్యాదకు మారుపేరు రాజు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు.’’ అని పేర్కొన్నారు.