విశాఖ రైల్వే జోన్ కు కట్టుబడే వున్నాం : కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ క్లారిటీ

విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పేసిందంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీంతో ఏపీ రాజకీయాలు కాస్త వేడెక్కాయి. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ వదంతులను అస్సలు నమ్మవద్దని కోరారు. విశాఖ రైల్వే జోన్ హామీకే తాము కట్టుబడి వున్నామని తేల్చి చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులనూ నమ్మవద్దని, రైల్వే జోన్ ఏర్పాటుకే కట్టుబడి వున్నామన్నారు. జోన్ ఏర్పాటుకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని, భూసేకరణ కూడా పూర్తైందని ప్రకటించారు.

 

ఇక… బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు కూడా స్పందించారు. కొత్త రైల్వే జోన్ కు కేంద్రం సిద్ధంగా వుందని ప్రకటించారు. కొన్ని పత్రికలు అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అది సరికాదని హితవు పలికారు. నిజాన్ని తెలుసుకోకుండా రాస్తే విశ్వసనీయత లోపిస్తుందన్నారు. రైల్వే జోన్ ఆమోదం కాకుండా సదుపాయాల గురించి ఎలా ఆలోచిస్తారని మండిపడ్డారు. రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాఠితో కూడా తాను స్వయంగా మాట్లాడాలని, తాము కట్టుబడే వున్నామని అన్నారు.

 

ఇక… మరోవైపు ఈ వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. విశాఖ రైల్వే జోన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదని వెల్లడించారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చితీరుతుందని, రాకపోతే రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Related Posts