కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. కర్నాటక రాయచూర్ నుంచి కృష్ణానది మీదుగా నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ అడుగుపెట్టారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణలోకి ప్రవేశించిన అనంతరం కర్నాటక పీసీసీ డీకే శివ కుమార్.. రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జాతీయ జెండాను అందజేశారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో నడుస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర సందర్భంగా పోలీసులు మక్తల్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు గుడిబెల్లూరు దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత రాహుల్ ప్రసంగించనున్నారు.

 

 

ఇక… ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. అనంతరం మూడు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. దీపావళి పండుగ, 26న ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ఆయన 24 నుంచి 26 వరకు యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. మక్తల్‌‌‌‌‌‌‌‌లో ఉదయం పాదయాత్ర పూర్తైన తర్వాత రాహుల్ ఢిల్లీకి వెళ్తారు. 27న తిరిగి పాదయాత్ర మొదలుపెడతారు. రాష్ట్రంలో రాహుల్ యాత్ర 13 రోజుల పాటు సాగనుంది. భారత్ జోడో యాత్ర 31న శంషాబాద్ మీదుగా హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్​లో యాత్ర చేసి కూకట్​పల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా సంగారెడ్డికి వెళ్తారు.