మూడు రోజుల విరామం తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభమైంది. నేటి ఉదయం 6 గంటలకు మక్తల్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పెద్ద చెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకూ రాహుల్ పాదయాత్ర సాగనుంది. బండ్లగుంట వద్ద రాహుల్ లంచ్ చేస్తారు. ఆ తర్వాత పాదయాత్ర చేసి, రాత్రి గుడిగుండ్ల దగ్గర బస చేస్తారని పార్టీ తెలిపింది. మొదటి రోజు రాహుల్ 26 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 23న రాయచూర్ నుంచి రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. అయితే ఒక్కరోజు యాత్ర చేసిన రాహుల్ గాంధీ మూడు రోజుల విరామం ప్రకటించారు. దీపావళి, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన తిరిగి యాత్ర మొదలుపెట్టారు.