బీజేపీ నేతల విమర్శలతోనే తన భారత్ జోడో యాత్రకు భారీగా ప్రచారం వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు ఒక సాధారణ పాదయాత్ర లాగే భావించానని, అయితే అడుగడుగున బీజేపీ తమ యాత్రను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని వ్యాఖ్యానించారు. అందుకు బీజేపీ నేతలకు తాను కృతజ్ఞతలు చెబుతున్నానని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఇకపై కూడా తమను బాగా విమర్శించాలని కోరుకుంటున్నానని, దాంతో కాంగ్రెస్ పార్టీకి వారి భావజాలాన్ని అర్ధం చేసుకునే అవకాశం దక్కుతుందని అన్నారు. నాయకులు ఏం చేయకూడదనేది వాళ్లు (బీజేపీ నేతలు) నాకు చేసి చూపిస్తున్నారని, అందుకే వారిని తన గురువులుగా భావిస్తున్నానని, రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇటీవల రాహుల్ గాంధీ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న విమర్శల నేపథ్యంలో ఈ అంశాలపై కూడా స్పందించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని హోంశాఖ చెబుతోందని, అలా ఎలా చేయగలనని ప్రశ్నించారు. యాత్రలో తాను కాలి నడకనే వెళ్లాలని అనుకుంటున్నానని, అప్పుడు కూడా భద్రత ఎలా ఇవ్వాలో వారికి తెలుసన్నారు. కేంద్రం తన భద్రతపై కావాలనే రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అలాగే తన టీ షర్ట్ పై రగడ చేస్తున్నారని, నాకు చలి అంటే భయం లేదని, పెద్దగా చలి అనిపించలేదన్నారు. అందుకే స్వెట్టర్ వేసుకోలేదని రాహుల్ తెలిపారు.












