పార్టీ అధ్యక్ష రేసులో తాను లేనని ఎంపీ రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. అయితే.. ఆ పదవిని చేపట్టే వారికి ఆయనో కీలక సూచన చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత అనేది పదవి కాదని, అది విశ్వాసం, భావజాలాన్ని, దేశ ధృక్కోణాన్ని ఆవిష్కరించే బాధ్య అని అన్నారు. అదో సైద్ధాంతిక పదవి అని, ఆ పదవి దేశ విజన్ ను కూడా తెలియజేస్తుందన్నారు. కేరళలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే… ఉదయ్ పూర్ వేదికగా జరిగిన ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి వున్నానని, ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న దానికే తాను కట్టుబడి వుంటానని స్పష్టం చేశారు. ఇదే పద్ధతి పార్టీలో కొనసాగుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
అయితే దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, కార్యకర్తల నివాసాలపై జరుగుతున్న దాడులపై కూడా రాహుల్ గాంధీ స్పందించారు. మతతత్వం ఎక్కడి నుంచి వచ్చినా… తాము సహించమని తెలిపారు. మతతత్వం ఎక్కడి నుంచి వచ్చినా… దానిని ఎదుర్కోవాలని, దానిని ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నదే తమ సిద్ధాంతమని రాహుల్ పేర్కొన్నారు.