ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏప్రిల్ 13 వరకూ బెయిల్ పొడిగిస్తూ సూరత్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. పరువునష్టం కేసులో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అప్పీల్‌కు వెళ్లారు. తనను దోషిగా తేల్చి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సోమవారం సవాల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు.. ఏప్రిల్ 13 వరకూ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13వ తేదీన ఉంటుందని తెలిపింది.
అయితే… విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇక… సెషన్స్ కోర్టుకి రాహుల్ తో పాటు సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీఎంలు, సీనియర్లు వచ్చారు. మరోవైపు రాహుల్ తో పాటు నేతలందరూ కోర్టుకి తరలిరావడంపై బీజేపీ విరుచుకుపడింది. ఓబీసీ వర్గాన్ని కించపరిచి, ఇప్పుడు అందరూ వచ్చి, డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
2023, మార్చి 23న సూరత్‌లోని కోర్టు.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావాలో ఈ శిక్ష విధించింది. అయితే.. అదే రోజు కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అతని శిక్ష అమలుపై 30 రోజుల స్టే విధించింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవటానికి అవకాశం కల్పించింది కోర్టు. ఈ నేపథ్యంలో రాహుల్ సూరత్ లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
ఇక… తనపై ఎన్ని కేసులు పెట్టినా… భయపడేది లేదని గతంలో రాహుల్ ప్రకటించారు.తనపై అనర్హత వేటు పడిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. తాను దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడానని, పోరాడుతూనే వుంటానని స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకే పంపినా… భయపడేదే లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వుంటానని పేర్కొన్నారు. వ్యాపారవేత్త అదానీపై ప్రశ్నించినందుకే కేంద్రం తనపై అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. ఇలాంటి అనర్హతల వంటివి తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వుంటానని స్పష్టం చేశారు.