కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో శనివారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. జలంధర్ లోక్సభ నియోజకవర్గ సభ్యుడు, కాంగ్రెస్ నేత చౌదరి సంతోష్ సింగ్ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్లోని ఫిలౌర్లో రాహుల్ గాంధీతోపాటు పాదయాత్రలో నడుస్తుండగా ఈ విషాదం జరిగింది. పాదయాత్ర సమయంలో ఎంపీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఫగ్వారాలోని విర్క్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు పేర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… వెంటనే తన యాత్ర నిలిపేసి, ఎంపీ చౌదరీ సంతోశ్ ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఇక… ఎంపీ సంతోశ్ సింగ్ చౌదరి మరణంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. జలంధర్ కి చెందిన కాంగ్రెస్ నేత సంతోశ్ సింగ్ చౌదరి అకాల మరణం పట్ల చాలా బాధపడ్డాను. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.












