వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తో పొత్తుపై కాంగ్రెస్ నేత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. ఇప్పటికే దీనిపై పీసీసీ నిర్ణయం తీసుకుందని, దాని ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ తిమ్మాపూర్ లో విలేకరులతో మాట్లాడారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పై కూడా వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కొందరు తమది పెద్ద పార్టీ అని ఊహించుకుంటారని ఎద్దేవా చేశారు.
అయితే… టీఆర్ఎస్ కూడా తాము జాతీయ స్థాయి నేతలని, అంతర్జాతీయ స్థాయి నేతలని అనుకుంటారని, అంతర్జాతీయ స్థాయి పార్టీ కూడా పెట్టుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా చైనాలో కూడా పోటీ చేయవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అమెరికా, చైనాలో కూడా పోటీ చేసుకోవచ్చని, దాంతో తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడే వారితో కలిసి పనిచేయమని, అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని రాహుల్ అన్నారు. మోదీ హయాంలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని, స్వతంత్రంగా వుండాల్సిన వ్యవస్థలను కూడా మోదీ ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. ఇక… తాము చేసే యాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తోందని, భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై పోరాట యాత్ర అని అభివర్ణించారు.