తెలంగాణలో తన భారత్ జోడో యాత్ర ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, తెలంగాణను వదిలి వెళ్తున్నందుకు బాధగా వుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశానికి ధైర్యాన్ని, శక్తిని అందించే సామర్థ్యం తెలంగాణకు వుందని అన్నారు. భారత్ జోడో యాత్ర ముగింపులో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. తెలంగాణ సమాజంలో ప్రశ్నించేతత్వం, ఎదిరించే శక్తి వున్నాయన్నారు. తెలంగాణ గొంతును ఎవ్వరూ నొక్కలేరని, ఎవరూ అణచివేయలేరని అన్నారు.

 

తన పాదయాత్రలో దళితులు, ఆదివాసీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా అందరితోనూ మాట్లాడానని రాహుల్ గుర్తు చేసుకున్నారు. వారి ఆశల, కలలు ఎలా మిగిలిపోయాయో, తాము పడుతున్న బాధలు ఎలా వున్నాయో తనకు వివరించారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అనేది కేవలం వాగ్దానం లాగే మిగిలిపోయిందని విమర్శించారు. దళితులు, గిరిజనులకు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఇచ్చిన భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని రాహుల్ ఆరోపించారు. రైతుల నుంచి లాక్కున్న భూములను తాము అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ, కేసీఆర్ కలిసే పనిచేస్తున్నారని, మోసపూరిత వాగ్దానాలు, విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూ, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ దేశ, రాష్ట్ర ప్రజలను వారు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులుగా నటిస్తున్నాయని, అంతర్గతంగా మాత్రం రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందముందని అన్నారు.

 

సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ధరణి పోర్టల్ ను తెరిచి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పాదయాత్ర తనకు మరుపురాని ఘట్టమని, ప్రజలు అందించిన ప్రేమానురాగాలు, ఆశీర్వాదాలు కొత్త శక్తిని ఇచ్చాయని తెలిపారు. డప్పు వాయిద్యాల కోలాహలం, బోనాల సందడి, కొమ్ము, ధింసా డ్యాన్స్ తనకెంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు అందించిన స్ఫూర్తిని, శక్తిని ఎప్పటికీ మరిచిపోలేనని రాహుల్ పేర్కొన్నారు.