తనపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. విద్యార్హత విషయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే, ఆ విషయం పక్కన పెట్టి, సంబంధం లేని వాటి గురించి మాట్లాడారని విమర్శించారు. తనను సస్పెండ్ చేసినపుడు తనపై చేసిన ఆరోపణలు నిరూపించమంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదని రఘునందన్ రావు అన్నారు. తాను అక్రమంగా సంపాదించి ఉంటే.. ఇల్లీగల్ పనులు చేసుంటే.. ప్రగతి భవన్ గానీ, సీఎం ఆఫీస్ గానీ ఈ రోజు దాకా ఎందుకు విచారణ జరిపించలేకపోయిందని నిలదీశారు.
దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని రఘునందన్ సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చాక అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయిన ఆయన తన గురించి కామెంట్లు చేస్తున్నాడని మండిపడ్డారు. అయ్యప్ప మాల వేసుకొని, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లో వున్నప్పుడు సీఎం కేసీఆర్ ని దొర అని తిట్టారని, ఇప్పుడు అదే దొర వద్ద పనిచేస్తున్నారని రఘునందన్ ఎద్దేవా చేశారు.