అవార్డులకు విలువలు పోయాయి: నట్టి కుమార్

సినిమా రంగంలో అనేక ప్రైవేట్ అవార్డులు వచ్చేయడంతో అవార్డులకు ఉన్న విలువలు పడిపోతున్నాయని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారని, అయితే ఆ అవార్డులను ఇవ్వడం కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి మరచిపోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 2014 తర్వాత నుంచి ఇంతవరకు అసలు ఇవ్వలేదని చెప్పారు. ఇక ఏపీకి సంబంధించి లోగడ తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లకు కలిపి ఇచ్చిన నంది అవార్డులపై విమర్శలు కూడా వచ్చాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా వల్ల ఇబ్బందులు ఎదురుకావడంతో వాళ్లు ఇవ్వడానికి వీలుకాలేదని, దానిని కొంతమంది పనికట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నా ఉద్దేశ్యం ప్రకారం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వారు కూర్చుని, నంది అవార్డులపై అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే బావుంటుందని అన్నారు. ఇటీవల అవార్డుల విషయంపై సీనియర్ నిర్మాత దత్తు గారు, ఏపీ ఎఫ్.డి.సి. చైర్మన్ పోసాని గారు మాట్లాడిన మాటలు సమర్థనీయం కావని అన్నారు. దత్తు గారు టీడీపీ తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడితే, ఆ తర్వాతే పోసాని మాట్లాడారని అన్నారు. అయినా సినిమా రంగం విషయంలో పార్టీల కతీతంగా వ్యవహరించాలని అన్నారు

ఏపీలో షూటింగ్ లు ఏవీ!

ఆ మధ్య చిరంజీవి, రాజమౌళి, ఇంకొందరు సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వం పిలుపు మేరకు సీఎం జగన్ గారిని కలసి వచ్చారని, 30 శాతం షూటింగ్ ఏపీలో చేస్తామని హామీ కూడా ఇచ్చారని, అక్కడ విశాఖ, భీమిలి, అరకు, తిరుపతి, పాపికొండలు, గోదావరి, హార్సిలీ హిల్స్ వంటి అందమైన లొకేషన్స్ ఉన్నప్పటికీ పరిశ్రమకు చెందిన చాలా మంది కనీసం 30 శాతం షూటింగ్ కూడా చేయడం లేదని, ఎలాంటి స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్స్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. కానీ తమ సినిమాల రిలీజులు అప్పుడు టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం సినీ పరిశ్రమలోని కొందరు ఏపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుని, లబ్ది పొందుతుంటారని, వాళ్లంతా హైదరాబాద్ లోనే తమ సంస్థల కార్యాలయాలను కొనసాగిస్తూ, టాక్స్ లు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కడుతుంటారని, కానీ వైసీపీ ప్రభుత్వాన్ని వివిధ కోణాలలో పనికట్టుకుని, అది చేయలేదు, ఇది చేయలేదు అని విమర్శిస్తుంటారని ఆయన అన్నారు. వాస్తవానికి సినీ పరిశ్రమకు కులం, మతం లేదని, ఇక్కడ అందరూ ఒకటేనని, చిన్న, పెద్ద నిర్మాతలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న తేడా ఉందని, ఎంతసేపు చిన్న నిర్మాతలను తొక్కేయాలని చూసే కొద్దిమంది స్వార్ధపరులు ఉన్నారని, వాళ్ళ చేతుల్లోనే సినీ పరిశ్రమ మనుగడ సాగించడం ప్రమాదకరంగా మారిందని అన్నారు.
తెలంగాణాలో చిన్న సినిమా బతికే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. 7 లక్షలు, 5 లక్షలు, థియేటర్స్ రెంటల్స్ తో చిన్న సినిమాలను ఇక్కడ విడుదల చేయడం ఎంతో కష్టమైపోయిందని అన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ లో 1 లక్ష, రెండు లక్షల రెంటల్స్ తో చిన్న సినిమాల విడుదలకు కొంతమటుకు ఊపిరి తీసుకునే అవకాశం ఉందని అన్నారు. లోగడ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ఓ మీటింగ్ లో మేము ఐదారు పెద్ద నిర్మాతలనే పరిగణలోనికి తీసుకుంటామని అన్నారు. అలాంటప్పుడు పరిశ్రమలోని చిన్న నిర్మాతల బాధలను ఎవరికి చెప్పాలి? అని అన్నారు. ప్రతీ రోజు థియేటర్స్ లో ఐదు షో లకు చిన్న సినిమాల కోసం మధ్యాహ్నం 2-30 గంటలకు ఒక షో వేసుకునేలా నిబంధన తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వ హామీలేవీ అమలు కాకపోవడం విచారకరమని, ఇప్పటికైనా ఈ దిశగా ఆలోచించాలని అన్నారు.

Related Posts

Latest News Updates