టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసం ‘నీలాంగరై’లో భోజనం చేసిన వెంటనే శనివారం రాత్రి భోజనం చేసిన వెంటనే 8:50 ని.లకు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 78 ఏళ్లు. 1944 జూన్ 14న విజయవాడలో కాట్రగడ్డ మురారి జన్మించారు. సినిమాలపై మక్కువతో ఎంబీబీఎస్ చదువును మధ్యలోనే ఆపేసి చెన్నై వెళ్లారు. దర్శకుడు అవుదామనుకొని నిర్మాతగా మారారు. ‘యువచిత్ర ఆర్ట్స్’ పేరుతో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సీతామహాలక్ష్మి, గోరింటాకు, నారి నారి నడుమ మురారి, త్రిశూలం, అభిమన్యుడు, జానకిరాముడు చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురారి నిర్మించిన జానకిరాముడు చిత్రం నాగార్జున, విజయశాంతి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. కె విశ్వనాధ్ తో సీతామహాలక్ష్మి, దాసరి నారాయణ రావు తో గోరింటాకు, అభిమన్యుడు,ఏ కోదండ రామిరెడ్డి తో నారి నారి నడుమ మురారి, కోడి రామకృష్ణ తో శ్రీనివాస కళ్యాణం, సింగీతం శ్రీనివాస రావు తో జేగంటలు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే కాట్రగడ్డ మురారి నిర్మించిన అన్ని సినిమాలకు కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చడం విశేషం. సంగీతం పరంగాను ఆయన సినిమాలు మంచి గుర్తింపు సాధించాయి. 90వ దశకం వరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కాట్రగడ్డ మురారి 2012లో ‘నవ్విపోదురు గాక’ పేరుతో ఆత్మకథ రాశారు. కాట్రగడ్డ మరణవార్త తెలిసిన సినీ రంగ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిరంజీవి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మురారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.