రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుము ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదాశీర్వచనం అందిచారు. శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆతర్వాత భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ‘ప్రసాద్’ పథకం శిలాఫకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో తన పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందన్నారు. భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు. రామాయణంలో భద్రాచలానికి ప్రత్యేక అనుబంధం ఉందని రాష్ట్రపతి చెప్పారు. సీతారాములు, లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలం గడిపారని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతున్నదని వెల్లడించారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి పర్యాటకశాఖ దృష్టి సారించిందన్నారు.