రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్ కి రానున్నారు. ఈ నెల 30 వరకూ సికింద్రాబాద్ లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోనే బస చేస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్రపతి భవన్ అధికారులు ప్రకటించారు. మరో వైపు రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి మధ్యాహ్నం 12:30 కి శంషాబాద్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి… భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక శాఖ చేపట్టిన ప్రసాద్ అనే పథకం కింద పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అక్కడే వున్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శిస్తారు. కాసేపు విశ్రాంతి తర్వాత… సాయంత్రం 5 గంటల కల్లా హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం అమరవీరుల స్మారక చిహ్నం దగ్గర అమర జవాన్లకు నివాళులు అర్పిస్తారు. తదనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. సాయంత్రం 8 గంటలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో ఇచ్చే విందుల పాల్గొంటారు.
27 తేదీన నారాయణ గూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థల స్టాఫ్, విద్యార్థులతో రాష్ట్రపతి ముర్ము ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ పోలీసు అకాడమీలో 74 వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత మిథానికి వెళ్లి వైడ్ ప్లేట్ మిల్లును ప్రారంభిస్తారు. 28 వ తేదీన ప్రత్యేక హెలికాప్టర్ లో భద్రాచలం రామ దర్శనానికి వెళ్తారు. ప్రసాద్ పథకం కింద పలు పనులను ప్రారంభిస్తారు. వనవాసీ కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసే సమ్మక్క సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే ఆసిఫాబాద్ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ములుగులోని రామప్పను దర్శించుకుంటారు.
29 న ఉదయం నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శిస్తారు. బోధకులు, విద్యార్థులతో ముఖాముఖి జరుపుతారని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించి, చిన్నజీయర్ స్వామీజీతో భేటీ అవుతారు. 30 వ తేదీన ప్రత్యేక హెలికాప్టర్ లో యాదాద్రికి వెళ్లి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. తిరిగి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.