పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ, రాజ్యసభ చైర్మన్ ధన్కర్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… భారత్ అత్యంత ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ… ప్రపంచానికి పరిష్కార మార్గాలను చూపుతోందని తెలిపారు. భారత్ ను ప్రపంచం నేడు భిన్నమైన ధ్రుక్కోణం నుంచి చూస్తోందన్నారు. దేశంలో స్థిరమైన, నిర్భీతితో పాలించే నిర్ణయాత్మక ప్రభుత్వం వుందని, అందుకే 9 సంవత్సరాలుగా దేశ ప్రజలు ప్రభుత్వాన్ని ఎంతో ఆదరిస్తున్నారని వివరించారు. ఆర్టికల్ 370 మొదలు, ట్రిపుల్ తలాక్ వరకూ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుందని, ప్రజల కలలను సాకారం చేసేందుకు విశేషంగా పనిచేస్తోందన్నారు.

రాబోయే 25 సంవత్సరాలు భారత్ కి చాలా కీలకమైన రోజులని, దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని, సుభిక్షమైన మధ్య తరగతి అన్న భావన నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. ఆత్మనిర్బర్తో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని, అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ పై ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సహకాలను అందిస్తోందని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకొని, నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని, మరిన్ని కూడా రానున్నాయని తెలిపారు.

డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోందని, గరీబీ హఠావో అన్నది కేవలం నినాదం మాత్రమే కాదని, పేదల సమస్యలను పరిష్కరించి, వారి జీవితాల్లో సాధికారతను నింపడానికి తమ ప్రభుత్వం చాలా శ్రమిస్తోందని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. అవినీతిని ఏ స్థాయిలోనూ తమ ప్రభుత్వం ఉపేక్షించదని, ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అవినీతి అనేది పెద్ద శత్రువుగా తమ ప్రభుత్వం చూస్తుందని వివరించారు. అన్ని వర్గాలను ఆదరించాలన్న సమ ధ్యేయంతోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేరుస్తోందని, మొదటి సారిగా బిర్సాముండా జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.












