అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మైసూరు దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. మైసూరు రాజవంశీకుల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరీ దేవీకి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా రాష్ట్రపతి ముర్ము అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మైసూరు ఉత్సవాల్లో ఈ మధ్య కాలంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ముయే కావడం విశేషం. ఇక.. మైసూరు దసరా ఉత్సవాలు దేశ సంస్కృతిని చాటి చెబుతాయని పేర్కొన్నారు. దసరా లాంటి పండగలు సమాజ ఐక్యతను దోహదం చేస్తాయని అన్నారు.
మరోవైపు రాష్ట్రపతి ముర్ము మైసూరులో తయారైన తెలుపు రంగు బంగారు జరీ గీతల అంచుతో కూడిన పట్టు చీరను ధరించారు. రాష్ట్రపతి ముర్ము కోసం కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఈ నేత చీరను తయారుచేసింది. మైసూర్ సిల్క్ శారీ ధరించిన రాష్ట్రపతి ముర్ము దసరా ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మైసూరు జిల్లా పాలనా యంత్రాంగానికి చెందిన ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ఆమెను దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. ఆ సందర్భంగానే ఆ బృందం ఆమె కోసం ప్రత్యేకంగా నేయించిన మైసూరు సిల్క్ శారీని బహూకరించింది.