సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్..

భారత 50 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, సుప్రీం న్యాయమూర్తులు, సిబ్బంది హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8 న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రచూడ్ తదుపరి సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకూ అంటే 2 సంవత్సరాల పాటు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. ఈయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా పనిచేయడం విశేషం.

 

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడైన డీవై చంద్రచూడ్ 1959 నవంబర్ 11వ తేదీన జన్మించారు. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఆయన 1986 లో హార్వర్డ్ నుండి డాక్టర్ ఆఫ్ జ్యూరిడిషియల్ సైన్సెస్ (ఎస్జేడీ) డిగ్రీ పట్టా పొందారు. జస్టిస్ చంద్రచూడ్ 1998 నుండి 2000 వరకు భారతదేశానికి అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1998లో బాంబే హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన చంద్రచూడ్.. 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు అక్కడే పనిచేశారు. 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి లభించింది.

Related Posts

Latest News Updates