రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థల్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచనానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. తర్వాత, విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ తో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానమిచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలంగాణ పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ పోరాట యోధులను ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారని, నూతన విద్యా విధానం క్రియాశీలతను మేల్కొలుపుతుందని ద్రౌపతి ముర్ము అన్నారు. ఈ విధానం దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్ కోసం అనువైన విధానమన్నారు.

మనిషి ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా… తన మూలాలు, సంస్కృతిని ఏమాత్రం మరిచిపోవద్దని సూచించారు. హైదరాబాద్ ఐటీ సహా పలు రంగాల్లో బాగా పురోగతి సాధిస్తోందని, అందుకే విద్యార్థులందరూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన విద్యా విధానంలో క్రమశిక్షణ వుంటుందని, దీనిని గాంధీ పాటించారు కాబట్టే.. స్వాతంత్రం వచ్చిందన్నారు. చిన్నారులకు చిన్నతనం నుంచే వ్యావహారికత కూడా నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు.

జీవితంలో తృప్తి అనేది వుండాలని, అనారోగ్యకర పోటీతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. వేల కోట్లు వున్నా… ఆరడుగుల స్థలం, తినడానికి రెండు రొట్టలే కదా కావాల్సింది అని అన్నారు. స్త్రీలు, పురుషులు అన్న భేదభావం వుండకూడదని, దానిని పూర్తిగా విడనాడాలని హితవుపలికారు. పిల్లలు ఎవరితో కలుస్తున్నారు? ఎలాంటి వారితో మాట్లాడుతున్నారు? అనేది తల్లిదండ్రులు గమనించాలని కోరారు. రాజ్యాంగాన్ని కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఫాలో కావాలని కాదని, ప్రతి పౌరుడూ రాజ్యాంగాన్ని ఫాలో కావాలని రాష్ట్రపతి ముర్ము సూచించారు.