మకర సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ప్రభల ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. ప్రతి చోటా ప్రభల ఉత్సవాలు కనుమ రోజు జరిగితే.. కొత్తపేటలో మాత్రం మకర సంక్రాంతి రోజే చేస్తారు. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల గుండా ప్రభల ఊరేగింపు సాగింది. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలతో పాటు బాణాసంచా కాల్పుల నడుమ ఈ ఊరేగింపు సాగింది. ప్రభల ఉత్సవాల సందర్భంగా వీధుల్లో పోటాపోటీగా బాణాసంచా కాల్చారు.
సంక్రాంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని దాదాపు 120 గ్రామాల్లో ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు. అందులో ప్రత్యేకమైనది అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట. ఇక్కడ జరిగే తీర్థాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి కూడా ప్రజలు తరలివస్తారు.ప్రధాన కొయ్యకు అర్ధచంద్రాకారంగా వెదురు బద్దలు అల్లి వాటి మధ్య రంగురంగుల నూలుతో ప్రభలను తీర్చిదిద్దుతారు. శిఖర భాగంలో త్రిశూలం, మధ్య భాగంలో మకరతోరణంతో ఉన్న మహా రుద్రుడి ఉత్సమ ప్రతిమను కొలువు తీర్చుతారు. దీనిని ఒక బల్లపై అమర్చి భుజాలపై మోస్తూ ఆశ్శరభ.. శరభ అంటూ శరణు ఘోషతో తీర్థ స్థలికి తీసుకువస్తారు.