ప్రపంచతెలుగు.కామ్ రేటింగ్ 2.5/5
నిర్మాణ సంస్థలు: మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, ఆర్. పార్తిబన్ తదితరులు నటించారు
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
మాటలు: తనికెళ్ళ భరణి (తెలుగు అనువాదం)
కథ : ‘కల్కి’ కృష్ణ మూర్తి
నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
దర్శకత్వం : మణిరత్నం
విడుదల తేదీ: 30.09.2022
ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ మణిరత్నం నేతృత్వం లో మన బాహుబలి రేంజ్ లో రూపొందిన తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్. మణిరత్నంకు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీని ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకున్నాడు. ఎట్టకేలకు ఈ డ్రీమ్ ప్రాజెక్టు ఈ రోజు శుక్రవారం (30 సెప్టెంబర్) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం సినిమాలకు మొదటి నుంచి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావటం లేదు. అయితే ఆయనకి చాలా కాలంగా ఓ డ్రీమ్ ఉంది. తమిళంలో బాగా ప్రాచుర్యం పొందిన ‘పల్లవాస్ ఆఫ్ కంచి’ అనే పుస్తకాల ఆధారంగా ‘కల్కి’ కృష్ణ మూర్తి నవలను తెరకెక్కించాలని. అందుకోసం ఆయన చాలా కష్ట,నష్టాలకు ఓర్చి, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు ముందుకొచ్చి రిలీజ్ చేసాడు. ఎందుకో గాని ఈ సినిమాని తెలుగువాళ్లు ఓన్ చేసుకోలేదు. కేవలం తమిళంకే పరిమితమైన చరిత్రను తెలుగు వారు చూడటం కష్టమనే భావన చాలా మందిలో ఉంది. అది నిజమేనా…తెలుగువారికి ఈ కథ పడుతుందా…అసలు ఆ కథేంటి..సాంకేతిక పరంగా, విజువల్ గా బాహుబలి స్దాయిలో ఏమైనా వర్కవుట్ అవుతుందా…రివ్యూ లో చూద్దాం.
కథ :
10వ శతాబ్దం నేపథ్యంలో చోళ రాజవంశం చుట్టూ సాగుతూ ఈ కథ మొదలైంది. చోళ రాజ్యాన్ని హస్త గతం చేసుకోవడానికి ఆ కుటుంబంలోని ఆ రాజు అన్నయ్య కుమారుడే కుట్రలు పన్నుతాడు. మరో వైపు చోళ రాజ్య యువరాజు ఆదిత్య (విక్రమ్) గతంలో పాండ్య రాజును చంపినందుకు ఐశ్వర్య రాయ్ (నందిని) కుట్రలు పన్నుతూ.. చోళ రాజ్యం నాశనానికి పునాదులు తవ్వుతూ ఉంటుంది. కానీ, అప్పటికే చోళ రాజ్యపు యువరాజు ఆదిత్య (విక్రమ్), అతని తమ్ముడు అరుణ్ మోళి (జయం రవి) ఇతర రాజ్యాల పై యుద్దానికి వెళ్తారు. ఇద్దరు దండయాత్ర చేస్తూ.. చేరే రాజ్యం వైపు వెళ్తారు. ఈ క్రమంలో చోళ రాజ్యం పై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడానకి తన మిత్రుడు వల్లవ్ రాయ్ (కార్తీ) ని ఆదిత్య చోళ రాజ్యపు రాజు (ప్రకాష్ రాజ్) దగ్గరకు పంపుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది ?, చోళ రాజ్యపు యువరాణి (త్రిష), వల్లవ్ రాయ్ (కార్తీ)కి ఏం చెప్పింది ?, వల్లవ్ రాయ్ (కార్తీ) అరుణ్ మోళి (జయం రవి) దగ్గరకు ఎందుకు వెళ్ళాడు ?, చివరకు మొదటి భాగం కథ ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథ.
నటీనటుల హావభావాలు:
ఈ సినిమాలో నటించిన నటులంతా ఆల్రెడీ అద్బుతాలు చేయగలరని ప్రూవ్ అయిన వారే వున్నారు. ముఖ్యంగా విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ వంటి వారు గురించి చెప్పేదేముంది. అందూలోనూ మణిరత్నం వంటి దర్శకుడు చేతిలో పడ్డాక ఆ మాణిక్యాలు మరింత మెరుగు దిద్దుకుంటాయి. అదే ఈ చిత్రంలో జరిగింది. చోళ రాజు ఆదిత్య కరికాలుడు పాత్రలో విక్రమ్ నటన అయితే నెక్స్ట్ లెవెల్ లో వుంది. ఒక గొప్ప యోధుడి గా మనకు గుర్తుండిపోతాడు. త్రిష, ..వయస్సు పెరుగుతున్నా చెక్కు చెదరని అందం..నందినిగా చేసిన ఐశ్వర్య లుక్ తోనే అభిమానులను ఆకట్టుకుంది. కార్తి తన నటనతో థియేటర్లో కేక పెట్టించాడు. జయం రవి …మనకు పరిచయం తక్కువ కాబట్టి ఓకే అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ విషయం వేరే చెప్పాల్సిన పని లేదు ఏ పాత్ర లో అయినా ఒదిగిపోయే నటుడు. ఇక మిగతా నటీ నటులు ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ,ఆర్. పార్తిబన్, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారని చెప్పొచ్చు.
సాంకేతికవర్గం పనితీరు:
భారతదేశం గర్వించదగ్గర దర్శకులలో మణిరత్నం ఒకరు అనే విషయంలో ఎవరికీ డౌట్స్ లేవు. అయితే ఆయనకు ఈ మధ్య సక్సెస్ లేకపోవటం అభిమానులను బాధ పెడుతోంది. అయితే ఆయన ప్రతీ సినిమా తనదైన ముద్రతో అంతే శ్రద్దగా చేస్తారు. ఈ సినిమా కూడా ఆయన స్టైల్ లో శిల్పంలా చెక్కుదామనే ప్రయత్నం చేసారు. అయితే స్క్రిప్టులో నేటి జనరేషన్ ఆశిస్తున్న మరింత ఇంటెన్స్, టెన్షన్ ఎలిమెంట్స్ వంటివి కలిపితే బాగుండేది అనిపిస్తుంది. అయితే కల్కి కృష్ణ మూర్తి రాసిన ఈ పెద్ద నవలను…కుదించి, క్యారక్టర్స్ ని కొన్ని మాత్రమే తీసుకుని స్క్రిప్టు రాయటం అంటే మాములు విషయం కాదు. అందులోనూ ఈ జనరేషన్ కు అర్దమయ్యేటట్లు ఆ కథను చెప్పాలి. అప్పట్లో అంటే కల్కి నవలను చదివిన వారు ఎక్కువమంది వున్నారు కాబట్టి వాళ్లకు ఈజీగా అర్దమవుతుంది. ఇప్పటి జనరేషన్ కి పుస్తకాలూ చదివే తీరిక లేకుండా పోయింది. విజువల్ ట్రీట్ కు అలవాటు పడ్డారు అయినా సరే! ఈ జనరేషన్ కి అర్ధమయ్యేలా ఈ చిత్రం మలిచారని ఆ విషయంలో దాదాపు మణిరత్నం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కాకపోతే మన తెలుగువారికే ఆ చరిత్ర, పాత్రలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఇక ఎప్పటిలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఏ ఆర్ రెహమాన్ మణి రత్నం కాంబినేషన్ అంటేనే మ్యూజిక్ హిట్ కానీ ఈ చిత్రంలోని పాటలు చాలా వరకు తమిళ ఫ్లేవర్ తో నిండిపోవడం వలన పాటలు అంతగా మనకు రుచించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సీన్స్ బలం చేకూర్చారు. ఇక వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా అద్బుతం అని చెప్పలేం కానీ బాగుంది. తెలుగులో డబ్బింగ్ డైలాగులు తణికెళ్ళ భరణి రాసారు. కొన్ని చోట్ల ఒరిజనల్ లోని గాఢత వర్కవుట్ అయ్యింది. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు భారీగా బాగున్నాయి.
విశ్లేషణ:
మెగాస్టార్ చిరంజీవి వాయస్ ఓవర్ తో మొదలయ్యే ఈ చిత్రం చారిత్రక సంఘటనలతో మాత్రమే ముడిపడి ఉంటుంది. ఈ చిత్రం కథకు మూలం పొన్నియిన్ సెల్వన్ అనే తమిళనాడులో పాపులరైన ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు. ప్రముఖ చరిత్రకారులు కె.ఎ. నీలకంఠ శాస్త్రి రాసిన ‘ది చోళాస్’ పుస్తకం, టి.వి. సదాశివ బండారుతార్ రచించిన ‘హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్’, ఆర్. గోపాలన్ రాసిన ‘పల్లవాస్ ఆఫ్ కంచి’ అనే పుస్తకాల ఆధారంగా ‘కల్కి’ నవలను రాశారు. తన మ్యాగజీన్ ‘కల్కి’ కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు. చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. పరాంతక చోళునికే సుందర చోళ అనే మరో పేరు కూడా ఉంది. కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి. కల్కి నవలను 5 భాగాలుగా రాశారు. వాటిన్నటిని బేస్ చేసుకుని ఈ సినిమా తీసారు. మణిరత్నం ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. భారతీయ సినిమా పుట్టిననాటినుండి చాలామంది ఈ నవలను సినిమాగా తీయడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు తెరకెక్కిన ఈ చిత్రరాజం….తమిళం వాళ్లకు నచ్చే అంశాలతోనే తెరకెక్కింది. ఇందులో ఫాంటసీ ఊహాజనిత సన్నివేశాలు లేవు . ఇది బాహుబలి కథలా స్వంతంగా రాసుకున్న ఫిక్షన్ కథ అయితే యూనవర్శిల్ అప్పీల్ తెచ్చే అవకాశం ఉండేదేమో?. కానీ ఈ సినిమాకు కుదరదు. అలాగే ఈ కథను పూర్తిగా పుస్తకం అనుసరించి చేయటం వల్లనేమో …ట్విస్ట్ లు, వావ్ ఎలిమెంట్స్ ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే లో కనపడలేదు. వరసగా పాత్రల పరిచయం జరిగిపోతూంటుంది. కథ జరిగే ప్రాంతాలు మారిపోతూంటాయి. కానీ కథ కదిలినట్లు అనిపించదు. దానికి తోడు స్లోగా కథ నడవటం కూడా ఇబ్బంది పెడుతుంది. ఎవరు ఈ కథలో విలన్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం … ఓ ఇన్విస్టిగేషన్ స్టైల్ లో కథ కొంతమేర నడవటం తో ఎక్కడా ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ కనపడదు. ఉన్నంతలో ఇంటర్వెల్ తర్వత వచ్చన ప్లాష్ బ్యాక్ తో కథ కాస్త స్పీడ్ పెంచినట్లువుంటుంది. అప్పుడు గాని మనకు ఫస్ట్ హాఫ్ లో జరిగిన సీన్స్ అర్దమవటం మొదలవుతాయి. అన్నిటికన్నా ప్రధాన మైన సమస్య.. బాహుబలి చిత్రంలోని పాత్రల్లా గుర్తుపెట్టుకుని గుర్తుండిపోయే పాత్రలు మనకు కనపడవు. అన్ని పాత్రలు సమాన ప్రాధాన్యం అన్న రీతిలో చిత్రీకరించారు. అది నవలలో చదవటానికి బాగుంటుంది కానీ సినిమాగా ఇబ్బంది పెడుతుందనే విషయాన్నీ ప్రీ ప్రొడక్షన్ లో జాగ్రత్త పడితే బాగుండేది. ఓవరాల్ గా ఈ సినిమా మన తెలుగువారిని ఆకట్టుకోలేక పోయింది.