కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు, రాహుల్ భారత్ జోడో యాత్ర… ఈ రెంటినీ కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. సరిగ్గా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలింగ్ సిబ్బంది తీరుపై పొన్నాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఓటర్ల జాబితాను ఎలా సవరిస్తారని పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ గాంధీ భవన్ ముందు నిరసనకు దిగారు.
నిజానికి జనగామ నుంచి పొన్నాలతో పాటు చెంచారపు శ్రీనివాస రెడ్డికి ఓటింగ్ ఐడీ కార్డు వచ్చింది. దీంతో ఓటు వేయడానికి పొన్నాలతో పాటు శ్రీనివాస రెడ్డి ఓటు వేయడానికి గాంధీ భవన్ కు వచ్చారు. అయితే.. శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసేందుకు అధికారులు నిరాకరించారు. రాత్రికి రాత్రే ఆయన పేరు తొలగించి, కొమ్మూరి ప్రతాపరెడ్డి పేరును పీసీసీ చేర్చింది. దీంతో పొన్నాల తీవ్రంగా ఫైర్ అయ్యారు. చివరికి జానా రెడ్డి సర్దిచెప్పడంతో పొన్నాల కాస్త వెనక్కి తగ్గారు. చివరికి కొమ్మూరికి, శ్రీనివాస రెడ్డికి ఓటు వేసే అధికారాన్ని రిటర్నింగ్ అధికారి కల్పించలేదు.