మునుగోడులో పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు మినహా… ప్రశాంతంగా సాగిందనే చెప్పాలి. మొత్తం 119 కేంద్రాల్లోని 298 బూత్ లలో పోలింగ్ జరిగింది. అయితే… 6 గంటల వరకూ లైన్లో వున్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మొత్తం 90 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకూ 77.55 శాతం పోలింగ్ నమోందైందని అధికారులు ప్రకటించారు. అయితే నాన్ లోకల్స్ భారీగా మునుగోడులోనే తిష్ఠ వేశారన్న వాదన బలంగా వినిపించింది. అలాగే పోలింగ్ జరుగుతున్నా…. మద్యం, డబ్బు విపరీతంగా పంచుతున్నారన్నది కూడా బట్టబయలైంది. ఇక… చౌటుప్పల్ మండలంలో సాయంత్రం 5 గంటల వరకూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోందైంది. మొత్తం 59,433మంది ఓటర్లుండగా… 47,496 ఓట్లు సాయంత్రం 5 గంటల లోపు నమోదయ్యాయి. 79.91 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక… సాయంత్రం 4 గంటల వరకూ చండూరులో 55.35 శాతం, చౌటుప్పల్ లో 60.26 శాతం, గట్టుప్పల్ లో 52.30 శాతం, మర్రిగూడలో 56.47 శాతం, మునుగోడులో 62.20 శాతం, నాంపల్లిలో 62.94 శాతం, నారాయణపూర్ లో 64.21 శాతం నమోదైంది.
పోలింగ్ ముగియడంతో ఇక.. అభ్యర్థులు తమ తమ విజయ అవకాశాలపై ఆశతో ఎదిరిచూస్తున్నారు. అయితే.. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొని వుంది. పోలింగ్ ముగిసినా… ఓటరు నాడి దొరకక పోవడంతో పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. అయితే.. ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమాను మాత్రం వ్యక్తం చేస్తున్నారు.